తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శివజ్యోతి

గూడూరు, సెప్టెంబర్ 24:
గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో కీలకమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శివజ్యోతి అన్నారు. పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా చెన్నూరు సెక్టార్ పరిధిలోని సీతవీధి అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

“సమాజ భాగస్వామ్యం–జవాబుదారితనం” అనే అంశంపై తల్లిదండ్రులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై వివరించారు.

ఈ సందర్భంగా వివిధ రకాల పోషకాహార పదార్థాలతో ప్రదర్శన ఏర్పాటు చేసి, వాటి ప్రయోజనాలను వివరించారు. చిన్నారుల పోషణ విషయంలో తల్లిదండ్రులు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు, సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని శివజ్యోతి సూచించారు. సమాజం సమష్టిగా భాగస్వామ్యం అయితే చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త రమణమ్మ, హెల్పర్లు, గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam