- ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు
- 8,500 మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
- రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
అక్టోబర్ 5 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ఈ నెల 9వ తేదీన కొండేపి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సింగోలులో నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమంలో సుమారు 8,500 మంది రైతులకు ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం కింద రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. రైతుల భూముల రికార్డులను మరింత పారదర్శకంగా, భద్రంగా ఉంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.
పర్యటనలో భాగంగా కలికివాయి, బిట్రగుంట, నర్సింగోలు ప్రాంతాల్లో కార్యక్రమాల నిర్వహణకు అనువైన స్థలాలను మంత్రి పరిశీలించారు. వేదికలు, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, పారిశుధ్యం, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరుకానున్నందున అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. నర్సింగోలులోని శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి ఆలయాలను సందర్శించిన మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శనీశ్వర ఆలయంలోనూ పూజలు చేసి రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, రైతుల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆలయ పరిసరాల అభివృద్ధిపై కూడా అధికారులకు సూచనలు చేశారు.
రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. భూ హక్కుల రక్షణ, వ్యవసాయాభివృద్ధి, సాగునీటి సౌకర్యాల కల్పన, రైతులకు అవసరమైన సేవలను అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రైతు కేంద్రిత పాలనతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. రాబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందుకోవడం రైతులకు చారిత్రక సందర్భంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా భూమిపై రైతుల హక్కులకు మరింత భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ఈ పర్యటన కీలకంగా మారనుందని మంత్రి అభిప్రాయపడ్డారు.












