పేదలు, రైతుల సమస్యలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ పోరాటం

రైతుకు రావాల్సిన రుణం అందించాలని బ్యాంక్ ఎదుట నిరసన

గాజువాక, ప్రజా వీక్షణం

విశాఖపట్నం: పేదలు, రైతులు, బాధితుల సమస్యల పరిష్కారం కోసం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గాజువాకలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో బాధిత రైతుకు మంజూరైన రుణాన్ని నిబంధనల ప్రకారం అందించాలని డిమాండ్ చేశారు.నరేంద్ర ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ సంస్థకు ఎంఎస్‌ఎంఈ పథకం కింద సుమారు రూ.85 లక్షల రుణం మంజూరైనప్పటికీ, మొదటి విడతగా రూ.35 లక్షలు మాత్రమే అందాయని సంస్థ వ్యవస్థాపకుడు కె.ఎస్.ఆర్. నాయుడు తెలిపారు. మిగిలిన రుణం కోసం పలుమార్లు బ్యాంకు అధికారులను సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.ఈ సమస్యను ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి. సంపత్ కుమార్ దృష్టికి తీసుకురావడంతో, ఆయన ఆధ్వర్యంలో ప్రతినిధులు బ్యాంకు అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించాలని కోరారు. బాధిత రైతు సమర్పించిన పత్రాలు, ఆధారాలను పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ.. పేదలు, రైతులు, సామాన్య ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వారికి అండగా నిలవడం ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కారం లభించేలా కృషి చేస్తామని తెలిపారు.రైతులు, చిన్న వ్యాపారులకు ప్రభుత్వ పథకాల ద్వారా అందాల్సిన రుణాలు నిబంధనల ప్రకారం, పారదర్శకంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంకింగ్ వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలను సంబంధిత ఉన్నతాధికారులు, చట్టబద్ధ సంస్థలు పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
పేదలు, రైతులు, బాధితుల సమస్యలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తామని డాక్టర్ పి. సంపత్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ నేషనల్ కోఆర్డినేటర్ బుగత లీలా ప్రసాద్, స్టేట్ మీడియా కోఆర్డినేటర్ శ్రీనివాస నాయుడు, విశాఖ జిల్లా సభ్యుడు శ్రీధర్ మహేష్, నరేంద్ర ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వ్యవస్థాపకుడు కె.ఎస్.ఆర్. నాయుడు, ఉద్యోగులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam