
గూడూరు: అక్టోబర్ 08
నెల్లూరు జిల్లా గూడూరు మండలం తిప్పవరప్పాడు సెక్టార్ పరిధిలోని కొమ్మనేటూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో నెల రోజులపాటు నిర్వహించిన పోషకాహార మహోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. అంగన్వాడీ కేంద్రం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పోషకాహార మహోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు తిప్పవరప్పాడు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడం, సమతుల్య ఆహారం ప్రాధాన్యతను వివరించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.కొమ్మనేటూరు గ్రామంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో భాగంగా పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల ఎదుగుదలకు అవసరమైన పోషక విలువలున్న ఆహార పదార్థాల గురించి అంగన్వాడీ సిబ్బంది వివరించారు. గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా తిప్పవరప్పాడు సెక్టార్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ మోహభూబి మాట్లాడుతూ.. పోషకాహార మహోత్సవాల ద్వారా ప్రజల్లో పోషకాహారంపై అవగాహన మరింత పెంచడమే లక్ష్యమన్నారు. నెల రోజులపాటు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. కొమ్మనేటూరు గ్రామంలో చివరి రోజు నిర్వహించిన కార్యక్రమాన్ని కూడా అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.అంగన్వాడీ వర్కర్ మాణిక్యమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు.కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.












