గూడూరు, అక్టోబర్ 8:
జెండా పండగ నేపథ్యంలో గూడూరు పోలీసులు ముందస్తు భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టారు. గూడూరు డీఎస్పీ, వన్‌టౌన్ సీఐలు పట్టణంలోని తూర్పువీధి, కర్ణాలవీధి ప్రాంతాలను సందర్శించి పండగ ఏర్పాట్లు, భద్రతా పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల పండగ కమిటీ సభ్యులతో పోలీసులు సమావేశమై పండగ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, ఊరేగింపు, ప్రజల రాకపోకలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పండగ సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కమిటీ సభ్యులకు పోలీసులు సూచించారు. పండగ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.జెండా పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కమిటీ సభ్యులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు. ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.












