ముంబై, అక్టోబరు 8 ( ప్రతినిధి): ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ వినియోగదారులకు షాకిచ్చింది. ఉత్పత్తిలో ఉపయోగించే ముడిసరుకుల ధరలు గణనీయంగా పెరగడంతో ప్రముఖ డిటర్జెంట్ బ్రాండ్ల ధరలను పెంచింది. అక్టోబరు నుంచి సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా3 డిటర్జెంట్ పౌడర్లు, సబ్బుల ధరలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై కొంత అదనపు భారం పడనుంది.
సర్ఫ్ ఎక్సెల్ ధరలు పెరిగాయి
ధరల పెంపు ప్రధానంగా సర్ఫ్ ఎక్సెల్, రిన్ బ్రాండ్లపై ప్రభావం చూపింది. సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ కిలో ప్యాక్ ధర రూ.167 నుంచి రూ.172కు పెరిగింది. 500 గ్రాముల ప్యాక్ ధర రూ.85 నుంచి రూ.87కు చేరింది. ఇక 250 గ్రాముల సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర రూ.42 నుంచి రూ.45కు పెరిగింది.
రిన్ ఉత్పత్తుల ధరలూ పెంపు
రిన్ పౌడర్ కిలో ప్యాక్ ధర రూ.120 నుంచి రూ.123కు పెరిగింది. రిన్ అలా 500 మిల్లీలీటర్ల ద్రవం ధర రూ.90 నుంచి రూ.95కు చేరింది. దీంతో రిన్ ఉత్పత్తులను నిత్యం వినియోగించే కుటుంబాలపై కూడా అదనపు భారం పడనుంది.
వీల్ పౌడర్ కూడా ప్రియం
పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా వినియోగించే వీల్ డిటర్జెంట్ పౌడర్ ధరను కూడా హెచ్యూఎల్ సవరించింది. కిలో ప్యాక్ ధర గతంలో రూ.90 ఉండగా.. తాజా పెంపుతో రూ.93కు చేరింది. ముడిసరుకుల వ్యయం పెరగడం, ఉత్పత్తి ఖర్చులు అధికం కావడం నేపథ్యంలో ధరలను సవరించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. నిత్యావసర వస్తువుల ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పెంపు వినియోగదారుల నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.












