యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం – ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

గూడూరు మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్ల అందజేత

గూడూరు,ప్రజా వీక్షణం అక్టోబర్ 09

నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన పాల్గొని, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువత తమ అర్హతలు, నైపుణ్యాలను సద్వినియోగం చేసుకొని అందివచ్చిన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వహించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విద్యాసంస్థలు, పరిశ్రమలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ, గూడూరు ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగ అవకాశాల కల్పన కోసం వివిధ కంపెనీల ప్రతినిధులతో సమన్వయం చేసిన జనసేన వీరమహిళ ఎం. శ్రీలతను అభినందించారు. కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, నారాయణ కళాశాల యాజమాన్యం, ప్లేస్‌మెంట్ విభాగం, కంపెనీల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.జనసేన పార్టీ నాయకుడు కె. మోహన్ మాట్లాడుతూ, జాబ్ మేళా విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.వీరమహిళ ఎం. శ్రీలత మాట్లాడుతూ, ఏడు ప్రముఖ కంపెనీల సహకారంతో సుమారు 700 ఉద్యోగావకాశాలు కల్పించేలా జాబ్ మేళా నిర్వహించినట్లు వెల్లడించారు. అర్హులైన నిరుద్యోగ యువతకు తగిన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణ కళాశాల మేనేజ్‌మెంట్ సెక్రటరీ వై. వినయ్ కుమార్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ డి. రాజేష్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ కె. విశ్వక్సేన రెడ్డి, జనసేన నాయకులు విజయ్, నవీన్, సాయి, మహేష్, శివాజీ, శ్రవణ్, కంపెనీల ప్రతినిధి భాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam