చిన్ననాటి ప్రేమ జ్ఞాపకాన్ని పంచుకున్న అనుష్క

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ప్రజా వీక్షణం ప్రతినిధి): దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి.. వ్యక్తిగత విషయాలను మాత్రం ఎప్పుడూ గోప్యంగానే ఉంచుతుంటారు. అయితే, ఆమె చిన్ననాటి ప్రేమ జ్ఞాపకానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరో తరగతిలో చదువుతున్నప్పుడు ఓ అబ్బాయి తనకు ప్రేమప్రపోజల్‌ చేసిన సంఘటనను అనుష్క ఓ సందర్భంలో పంచుకున్నట్లు సమాచారం.
‘ఐ లవ్‌ యు’ అంటే తెలియక..
చిన్నతనంలో ఓ అబ్బాయి తన దగ్గరకు వచ్చి నేరుగా ‘ఐ లవ్‌ యు’ అని చెప్పాడట. అయితే, అప్పటికి ప్రేమ అంటే ఏమిటో, ఆ మాటకు అర్థం ఏమిటో కూడా తనకు తెలియదని అనుష్క చెప్పినట్లు తెలుస్తోంది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అమాయకంగా ‘సరే’ అని చెప్పేశానని నవ్వుతూ గుర్తుచేసుకున్నారట. ఆ సంఘటనను ఇప్పుడు తలుచుకుంటే ఎంతో సరదాగా, మధురమైన జ్ఞాపకంగా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వ్యక్తిగత జీవితంపై ఆసక్తి
అనుష్క వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు, ఎవరిని వివాహం చేసుకుంటారనే ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి. ఓ పాన్‌ ఇండియా హీరోతో ఆమెకు ప్రేమ సంబంధం ఉందంటూ గతంలో పలు ఊహాగానాలు వచ్చినప్పటికీ, వారిద్దరూ మంచి స్నేహితులమని స్పష్టం చేసిన సందర్భాలున్నాయి. అయితే తన వ్యక్తిగత విషయాలపై అనుష్క సాధారణంగా ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడరు.
యోగా శిక్షకురాలి నుంచి స్టార్‌ హీరోయిన్‌గా..
సినిమాల్లోకి రాకముందు అనుష్క ముంబైలో యోగా శిక్షకురాలిగా పనిచేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దృష్టిలో పడటంతో నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘సూపర్‌’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత గ్లామర్‌ పాత్రల నుంచి నటనకు ప్రాధాన్యమున్న విభిన్నమైన పాత్రల వరకు ఎన్నో ప్రయోగాలు చేశారు. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’, ‘భాగమతి’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. వెండితెరపై తనదైన ముద్ర వేసిన అనుష్క.. వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ప్రైవేట్‌గా ఉంచుకోవడం విశేషం.

error: Content is protected !!
Prajaveek Shanam