37 బంతుల్లో డివిలియర్స్‌ విధ్వంసక శతకం

జోహన్నెస్‌బర్గ్‌, అక్టోబరు 10 (ప్రజా వీక్షణం ప్రతినిధి): దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ మరోసారి తన విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీలో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌పై కేవలం 37 బంతుల్లోనే శతకం సాధించాడు. ఆటకు వీడ్కోలు పలికిన ఐదేళ్ల తర్వాత కూడా తనలోని దూకుడు ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు.
40 బంతుల్లో 111 పరుగులు
ఆస్ట్రేలియా నిర్దేశించిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో డివిలియర్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైదానం నలువైపులా అద్భుతమైన షాట్లు ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తం 40 బంతులు ఎదుర్కొన్న అతడు ఆరు ఫోర్లు, 11 సిక్సర్లతో అజేయంగా 111 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా జట్టు 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
229 స్ట్రైక్‌రేట్‌తో పరుగుల వరద
ఈ టోర్నీలో డివిలియర్స్‌ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనే 181 పరుగులు సాధించి, 229.11 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తన పిల్లలు ప్రత్యక్షంగా తన ఆటను చూడాలనే కోరికతో ఈ టోర్నీలో పాల్గొంటున్నట్లు గతంలో తెలిపిన అతడు.. తనదైన శైలిలో అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నాడు.
ఐపీఎల్‌లోకి రావాలంటున్న అభిమానులు
డివిలియర్స్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ చూసిన అభిమానులు మళ్లీ ఐపీఎల్‌లో ఆడాలని కోరుతున్నారు. ముఖ్యంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున అతడు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నారు. 2011 నుంచి 2021 వరకు ఆర్‌సీబీ తరఫున 156 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్‌ 4,491 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 37 అర్ధశతకాలు ఉన్నాయి. అతడి తాజా ప్రదర్శనతో ఐపీఎల్‌ వేలంలో పాల్గొనాలంటూ అభిమానుల నుంచి మరోసారి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

error: Content is protected !!
Prajaveek Shanam