మాజీ సర్పంచ్ ఇనమల్ల శీనయ్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు
గూడూరు: ప్రజా వీక్షణం
గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు మండలం కుందకూరు పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ ఇనమల్ల శీనయ్య ఆధ్వర్యంలో సుమారు 300 మంది వైసీపీ కార్యకర్తలు ఆదివారం టీడీపీలో చేరారు. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాశిం సునీల్ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. గూడూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని అన్నారు.గతంలో నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని వారు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విద్యావంతులు, సమాజంపై అవగాహన కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పించామని, గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.










