తెలుగుదేశం పార్టీలోకి 50 కుటుంబాలు!

శ్రీకాకుళం, నవంబర్ 1( ప్రజా వీక్షణం ప్రతినిధి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కస్పా నౌపడ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలతోపాటు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.
నిమ్మాడలోని తన శిబిర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు కొత్తగా పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సుగ్గు సత్యనారాయణ, కర్రీ కాంతారావు, ఎం. బాబురావు, రెయ్య సుమన్‌, వెంకటరమణ, కోటి భీమారెడ్డి, కోటి కామేష్‌, రమణ, సత్తిబాబు, రాము తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరితోపాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పార్టీలో కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
టెక్కలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తూ నియోజకవర్గ ప్రగతికి సమష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam