రాష్ట్రంలో చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం నాటికి కిలో చికెన్ ధర రూ.350 నుంచి రూ.370 వరకు పెరిగింది. ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గత వారం వరకు రూ.325 ఉన్న స్కిన్లెస్ చికెన్ ధర ఒక్క వారంలోనే దాదాపు రూ.45 పెరిగి ప్రస్తుతం రూ.370కు చేరింది. డ్రెస్డ్ చికెన్ కిలో ధర రూ.320 ఉండగా, లైవ్ చికెన్ రూ.210-220 మధ్య అమ్ముడవుతోంది. నిజామాబాద్‌లో అయితే చికెన్ ధర కిలోకు రూ.400 దాటింది. బోన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.700కు పైగా ఉండటం వినియోగదారులకు భారంగా మారింది. ఇటీవలి కాలంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్, రంజాన్ సందర్భంగా చికెన్‌కు భారీ డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అదే సమయంలో వాతావరణ మార్పుల వల్ల కోళ్లు సరిగా పెరగకపోవడం, మరణాలు పెరగడం వల్ల సరఫరా తగ్గింది. దీంతో మార్కెట్లో డిమాండ్-సప్లై అసమతుల్యత ఏర్పడి ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే సరఫరా జరుగుతుండగా, ప్రస్తుతం సిద్దిపేట, మహబూబ్‌నగర్ వంటి దూర ప్రాంతాల నుంచి కోళ్లు తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కొన్ని సంస్థలు మార్జిన్ తగ్గించడంతో వ్యాపారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోళ్లు తగ్గించారు. గతంలో కిలో తీసుకునే వారు ఇప్పుడు 500 నుంచి 750 గ్రాములకే పరిమితం అవుతున్నారు. దీంతో అమ్మకాలు 30-40 శాతం వరకు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. నాటు కోడి ధరలు కూడా పెరిగి కిలో రూ.500కు చేరాయి. ఇక మరోవైపు కోడిగుడ్ల ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఎగుమతులు తగ్గిపోవడంతో దేశీయ మార్కెట్లో గుడ్ల సరఫరా పెరిగి, డిమాండ్ తగ్గడంతో ప్రస్తుతం ఒక్క గుడ్డు ధర రూ.4.50 నుంచి రూ.6 మధ్య ఉండగా, డజను గుడ్లు రూ.60కు విక్రయిస్తున్నారు.













