గూడూరులో ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి నిర్వహణ
నెల్లూరు జిల్లా భగత్ సింగ్ త్యాగం యువతకు ఆదర్శమని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి జి. శశికుమార్ పేర్కొన్నారు. సోమవారం గూడూరు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంభాన్ని ముద్దాడిన మహావీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల త్యాగాలను కొనియాడారు. భగత్ సింగ్ ఉరికంభాన్ని కూడా లెక్కచేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడని పేర్కొన్నారు. భారతమాతను దాస్య బంధనాల నుంచి విముక్తి కలిగించేందుకు పోరాటం చేసిన విప్లవ వీరుడిగా ఆయనను అభివర్ణించారు. స్వాతంత్ర్య సమరంలో భాగంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పొగ బాంబు విసిరి “ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదంతో దేశభక్తిని చాటిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత కాలంలో యువత మాదకద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధులను ఆదర్శంగా తీసుకుని యువత మంచి మార్గంలో నడవాలని సూచించారు. యువత తమ మేధస్సును సమాజానికి ఉపయోగపడేలా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి షేక్ జమాలుల్లా, పట్టణ కన్వీనర్ సునీల్, చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి కే. నారాయణ, ప్రజానాట్యమండలి నాయకులు బి. గోపాల్, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.












