అనుమానంతో భార్య హత్య – నిందితుడు అరెస్టు

అనుమానం పెనుభూతమై భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. హత్య అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తరలించి పొలాల్లో పడేసిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. సోమవారం షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ లక్ష్మీనారాయణ మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేటకు చెందిన పానుగంటి నర్సింలు (31), అదే ప్రాంతానికి చెందిన శోభ అలియాస్ శోభారాణి (33)ను నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కుమార్తె మమత ఉంది. శోభకు ముందే వివాహమై ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలం సజావుగా సాగిన దాంపత్యంలో నర్సింలు మద్యానికి బానిస కావడంతో వివాదాలు మొదలయ్యాయి. వేధింపులు భరించలేక శోభ తన కుమార్తెతో కలిసి రంగారెడ్డిగూడెంలో తన తల్లి వద్ద నివసిస్తోంది. భార్యపై అనుమానం పెంచుకున్న నర్సింలు ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. ఈ నెల 21న నీ కొడుక్కి సైకిల్ కొంటానని చెప్పి శోభను మహబూబ్‌నగర్‌కు పిలిపించాడు. ఆమె కుమార్తెతో కలిసి రాగా గదికి తీసుకెళ్లి మద్యం సేవించిన అనంతరం గొడవ జరిగి, ముందే సిద్ధం చేసుకున్న గ్రానైట్ రాయితో తలపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం రక్తపు మరకలను శుభ్రం చేసి, అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని మూటకట్టి బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ఉంచి, తన కుమార్తెను కూడా వెంట తీసుకుని రంగారెడ్డిగూడెం శివారులోని పొలంలో పడేసి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలను గుర్తించి, సోమవారం ఉదయం లింగంపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించగా, అతని వద్ద నుంచి సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన రాయి, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్ కె. సీతారాం, ఎస్ఐలు సుశీల, శ్రీకాంత్, రాజేశ్వర్, శివరెడ్డిలను ఫ్యూచర్ సిటీ కమిషనర్, షాద్‌నగర్ డీసీపీ అభినందించారు.

error: Content is protected !!
Prajaveek Shanam