ఉత్తరాంధ్రలో భారీ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన – లక్ష ఉద్యోగాలతో అభివృద్ధికి నూతన దిశ

ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన దిశగా నిలిచే భారీ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరగడం రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అన్నారు. క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆర్సెలార్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ ప్రపంచస్థాయి ఉక్కు కర్మాగారం దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. నేడు కేంద్రమంత్రి కుమారస్వామి, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. సుమారు రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో నిర్మించబడనున్న ఈ పరిశ్రమ ద్వారా లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని, స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ ట్రైనింగ్, అనుబంధ పరిశ్రమల ద్వారా దీర్ఘకాలిక అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతులు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా మారాయని, ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుండటం ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. మంత్రి నారా లోకేష్ కృషి ఈ ప్రాజెక్ట్ వెనుక ప్రధాన శక్తిగా నిలిచిందని, పెట్టుబడిదారులతో నిరంతర చర్చలు, సమన్వయం ద్వారా తక్కువ సమయంలో క్లియరెన్సులు సాధించడం జరిగిందన్నారు. “Jobs First” విజన్‌తో యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రం పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఎదుగుతుందని, ఉత్తరాంధ్ర ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు. పోర్ట్ కనెక్టివిటీ, రహదారి, రైల్వే సదుపాయాలు మెరుగుపడి లాజిస్టిక్స్ రంగం బలోపేతం అవుతుందని తెలిపారు. MSMEలు, చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెంది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడంలో, రాష్ట్ర GDP వృద్ధి, పెట్టుబడుల ప్రవాహం పెరగడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. మొత్తం 5,465 ఎకరాల్లో నిర్మించబడనున్న ఈ పరిశ్రమ ద్వారా లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని, 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్ట్ ఫర్నేస్, అదే సంవత్సరం డిసెంబరు నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు.

error: Content is protected !!
Prajaveek Shanam