హైదరాబాద్, అక్టోబర్ 21 (ప్రజా వీక్షణం ప్రతినిధి): తెలంగాణ పోలీసు శాఖలో సిబ్బంది కొరతను పూర్తిగా అధిగమించేందుకు విడతలవారీగా నియామకాలు చేపట్టి 2028 నాటికి అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ, సమాజ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శాంతియుతమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో 154 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేస్తూ వారికి హృదయపూర్వక నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు, పరిశ్రమలు, రహదారుల నిర్మాణం మాత్రమే సరిపోవని, ప్రజలు నిర్భయంగా జీవించగలిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెరగాలన్నా, సమాచార సాంకేతిక రంగం, పర్యాటకం విస్తరించాలన్నా శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని స్పష్టం చేశారు. అందుకే పోలీసు శాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. 2025 అక్టోబరు నాటికి సుమారు 16 వేల మంది కానిస్టేబుళ్లు, ఎస్సైలను నియమించామని, 2026లో మరో ఐదు వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చామని వెల్లడించారు. విడతలవారీగా నియామకాలు కొనసాగించి 2028 నాటికి సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేని విధంగా 112 మంది డీఎస్పీలను నియమించామని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ సహాయకులుగా నియమించి వారికి ఉపాధి అవకాశాలతో పాటు ఆత్మగౌరవాన్ని కల్పించామని వివరించారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అందించే పరిహారాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచిందని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కానిస్టేబుళ్లకు రూ.40 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.కోటికి పెంచామని, హెడ్ కానిస్టేబుళ్లు, సహాయ ఉపనిరీక్షకుల పరిహారాన్ని కూడా రూ.కోటికి పెంచామని చెప్పారు. ఎస్సైలకు రూ.1.25 కోట్లు, ఇన్స్పెక్టర్లకు రూ.1.25 కోట్లు, డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులకు రూ.1.50 కోట్లు, ఎస్పీ, ఐపీఎస్ అధికారులకు రూ.2 కోట్ల వరకు పరిహారం అందించేలా మార్పులు చేసినట్లు వివరించారు. ఈ ఆర్థిక సహాయం కేవలం పరిహారం మాత్రమే కాదని, అమరవీరుల కుటుంబాల త్యాగాలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమని పేర్కొన్నారు. అర్హులైన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఇంటి స్థలం, ఉచిత విద్య, వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. వైద్య విద్యలో ప్రత్యేక సీట్లు కల్పిస్తున్నామని, భద్రతా సంక్షేమ నిధి నుంచి రూ.16 లక్షలు, సంక్షేమ నిధి నుంచి మరో రూ.8 లక్షలు అందించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. హోంగార్డుల వైద్య పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోలీసు శాఖలో హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు పనిచేస్తున్న సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ప్రాంతంలో 44 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీసు పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆహార కల్తీ వంటి నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ విభాగం పనితీరును అభినందించారు. కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ప్రారంభించామని, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ సేవలను బలోపేతం చేస్తున్నామని వివరించారు. మహిళల పట్ల సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమాన్ని, మహిళలు, పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ రక్షణ అందించేందుకు స్పందన బృందాలను ప్రారంభించినట్లు వెల్లడించారు.
పోలీసు అమరవీరుల కుటుంబాలు తమకు కలిగిన నష్టాన్ని పూర్తిగా అధిగమించడం సాధ్యం కాకపోయినా, వారికి ప్రభుత్వం, పోలీసు శాఖ, తెలంగాణ సమాజం అండగా ఉంటాయని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అమరుల పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబాల భద్రత విషయంలో మానవీయ దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. విధుల్లో ఉన్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు భరోసా కల్పించడం పోలీసుల బాధ్యత అని, సమస్యల పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించే సామాన్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, నేరస్థుల విషయంలో మాత్రం చట్టప్రకారం కఠినంగా ఉండాలని ఉద్బోధించారు. అమరులకు నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబాలకు అండగా నిలవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.










