
తిరుపతి జిల్లా ప్రతినిధి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 17 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,50,500 నగదు, 15 సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ శ్రీ రవి మనోహర చారి ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ సిబ్బంది, డీవీ సత్రం పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకటేశ్వర చౌదరి, చిట్టమూరు సర్కిల్ సిబ్బంది సంయుక్తంగా శ్రీకాళహస్తి రూరల్ సీఐ ఇబ్రహీం మరియు వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నవరం గ్రామ పంచాయతీ అటవీ ప్రాంతంలో అక్రమంగా జూదం ఆడుతున్న వారిపై మెరుపు దాడి చేసి మొత్తం 17 మంది జూదగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,50,500 నగదు, 15 సెల్ ఫోన్లు మరియు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు నిరంతరం ప్రత్యేక దాడులు కొనసాగించాలని జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు ఐపీఎస్ అధికారులను ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.











