ఏరూరులో గ్రామస్తుల నిరసన – లారీల రాకపోకలతో దెబ్బతిన్న రహదారి

చిల్లకూరు, ప్రతినిధి:
చిల్లకూరు మండలంలోని ఏరూరు గ్రామంలో శనివారం గ్రామస్తులు రహదారి దుస్థితిపై నిరసన వ్యక్తం చేశారు. నిత్యం ఈ మార్గంలో సంచరిస్తున్న మెగా, జిందాల్, మీనాక్షి, క్రిసిటీ కంపెనీలకు చెందిన భారీ లారీల రాకపోకల వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తులు లారీలను అడ్డుకోవడంతో సుమారు కిలోమీటర్ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ గోపీనాధ్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి రహదారి సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం గ్రామస్తులతో చర్చించారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, రోజూ భారీ లారీలలో గ్రావెల్, సిలికా తదితర మెటీరియల్స్ తరలింపుతో రోడ్డు గుంతలతో నిండిపోయిందన్నారు. లారీలు వెళ్లే సమయంలో గుంతల్లోని రాళ్లు ఎగిరి ప్రజలపై పడుతూ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
ఏరూరు గ్రామానికి వెళ్లే సుమారు కిలోమీటర్ మేర రహదారిని తక్షణమే పునర్నిర్మించకపోతే లారీలను అనుమతించమని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారు కోరారు.

Prajaveek Shanam