మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంస్వయం సహాయక సంఘాలకు రూ.304 కోట్లకు పైగా బ్యాంక్ లింకేజ్ చెక్కు – ఎమ్మెల్యే డా. పాశిం సునీల్ కుమార్

గూడూరు పట్టణం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని వనజా కృష్ణ కల్యాణ మండపంలో మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న 3,266 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా అందిస్తున్న రూ.304 కోట్ల 53 లక్షల 50 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళల జీవనోపాధి, ఆర్థిక స్వేచ్ఛ, అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితేనే కుటుంబాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.ప్రతి మహిళ పారిశ్రామికవేత్త కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. 2025–26 సంవత్సరంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం అమలు చేస్తున్నామని, 2026–27 నాటికి ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం లక్ష్యమని చెప్పారు.
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.38 వేల కోట్ల ఆర్థిక రుణ సాయం అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు అవసరమైన శిక్షణ, ఆర్థిక సహాయం కల్పించే దిశగా వివిధ పరిశ్రమలు మరియు సంస్థలతో 36 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని చెప్పారు.అదేవిధంగా “తల్లికి వందనం” పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థులకు రూ.10 వేల 90 కోట్ల 74 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేసిందన్నారు. ఉచిత బస్సు పథకం కింద మహిళలకు సంవత్సరానికి రూ.296 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని, ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా ప్రయాణాలు నమోదయ్యాయని తెలిపారు.రాష్ట్రంలోని 1.08 కోట్ల కుటుంబాలకు మూడు సిలిండర్ల చొప్పున మొత్తం 3.74 కోట్ల గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 7,955 మంది మహిళలకు ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించగా, మహిళా కానిస్టేబుళ్లుగా 993 మంది ఎంపికయ్యారని చెప్పారు.అలాగే గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్ల 92 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ వెల్లడించారు. MDR (మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్) మరియు SH (స్టేట్ హైవే) రోడ్ల అభివృద్ధి కింద మొత్తం 22 రహదారుల మరమ్మతులు మరియు అభివృద్ధి పనులకు ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు.మహిళల సాధికారతతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత ప్రాధాన్యతతో కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Prajaveek Shanam