
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అమలు చేస్తున్న ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ వ్యవస్థ ఫలితంగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. తిరుపతి జిల్లా ఆర్ఎస్ఎస్ ఏడిజె కోర్టు న్యాయమూర్తి ఏ. నరసింహమూర్తి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడికి 5 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల జైలు శిక్ష విధించారు.ఈ కేసులో నిందితుడు తైడాల మధుసూదన్ @ మధు (33), తండ్రి తైడాల చిన్న స్వామి, గొల్లపల్లి హరిజనవాడ, దేవరకొండ గ్రామం, చిన్నగొట్టికల్లు మండలం, తిరుపతి జిల్లా నివాసి. ఈ కేసు 2017 సంవత్సరంలో ఎర్రవారి పాలెం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం.20/2017గా నమోదు అయింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, కోర్టు తీర్పు చట్టాన్ని ఉల్లంఘించే వారికి గుణపాఠమని పేర్కొన్నారు. జిల్లాలో అడవుల సంపదను కాపాడటానికి పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారని, ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
ఈ కేసు విచారణ, పర్యవేక్షణలో కృషి చేసిన చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ. అమరనారాయణ, అప్పటి ఎస్ఐ డి. గోపి, సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.వి. సత్యనారాయణ, ప్రస్తుత ఎస్ఐ బి.వి. లోకేష్, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ హరినాథ్, కోర్టు కానిస్టేబుల్ డి. దుర్గాప్రసాద్లను ఎస్పీ అభినందించారు.
సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో అక్రమ రవాణాను ఉపేక్షించబోమని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.











