దుగ్గరాజుపట్నం పోర్టుతో మత్స్యకారుల జీవనోపాధి ప్రమాదంలో – వాకాడులో వినతిపత్రం

తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం గ్రామ మత్స్యకారులు తమ జీవనోపాధి రక్షణ కోరుతూ మంగళవారం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదిత దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మాణం వల్ల సముద్రంలో వేటకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయని, దీంతో వేలాది మత్స్యకార కుటుంబాలు జీవన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తూపిలిపాలెం పెద్దకాపు, జెమిని కొత్తపాలెం మాజీ సర్పంచ్ ఆర్కేటి మహేంద్ర ఆధ్వర్యంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను వివరించారు. తరతరాలుగా సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు పోర్టు నిర్మాణం పెద్ద దెబ్బగా మారుతుందని ఆర్కేటి మహేంద్ర తెలిపారు.
పోర్టు నిర్మాణం కారణంగా తమ వృత్తి పూర్తిగా దెబ్బతింటుందని, కేవలం పరిహారం ఇవ్వడం సరిపోదని, మత్స్యకార కుటుంబాల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం శాశ్వత జీవనోపాధి మార్గాలు కల్పించాలని వారు కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వం తగిన భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.మత్స్యకారుల వినతిని స్వీకరించిన తహశీల్దార్, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా చూస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మధ్యకాపు పామంజి గోవిందయ్య, చిన్నకాపు వావిల్లా సుబ్రహ్మణ్యం తదితరులు, తూపిలిపాలెం గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రజావిక్షణం- ప్రతినిధి

Prajaveek Shanam