అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్ – 52 కిలోల గంజాయి స్వాధీనం

విజయవాడ, మార్చి 10: కృష్ణాజిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి 52 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కేసు వివరాలను వెల్లడించారు.జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తొట్లవల్లూరు ఎస్‌ఐ పి. కిషోర్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దాంతో మధ్యాహ్నం సమయంలో AP05CQ7969 నంబర్ గల టాటా ఇండికా కారును ఆపి తనిఖీ చేయగా, అందులో 26 ప్యాకెట్లలో సుమారు 52 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయి విలువ సుమారు రూ.2.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రవాణాకు ఉపయోగించిన కారుతో పాటు ముగ్గురు నిందితులను, వారి వద్ద ఉన్న మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వారిలో తెనాలి పట్టణానికి చెందిన మనబోటి ఈశ్వరప్రసాద్ (40), తమిళనాడుకు చెందిన దురై మోహన్ కుమార్ (45), విశాఖపట్నం జిల్లా వడ్డాది మాడుగుల మండలానికి చెందిన అల్లా అమీన్ (39) ఉన్నారు. వీరికి గతంలో కూడా గంజాయి కేసుల్లో సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఈ ముఠా ప్రణాళిక రచించినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల నిఘాను తప్పించుకునేందుకు జాతీయ రహదారులు కాకుండా గ్రామీణ రహదారుల ద్వారా ప్రయాణించేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్పడిన వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సంబంధిత సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్ లేదా ఈగల్ టీం హెల్ప్‌లైన్ 1972 కు తెలియజేయాలని సూచించారు.అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పమిడిముక్కల సీఐ వై. చిట్టిబాబు, తొట్లవల్లూరు ఎస్‌ఐ పి. కిషోర్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Prajaveek Shanam