
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పాల్గొన్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, ప్రాణత్యాగం వల్లే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి మార్గం సుగమమైందని తెలిపారు. పొట్టి శ్రీరాములు దేశభక్తి, నిస్వార్థ సేవ, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడిగా పొట్టి శ్రీరాములు గుర్తింపు పొందారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించి సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మునిసిపల్ కమిషనర్ వేంకటేశ్వరులు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.











