బెంగళూరు, అక్టోబరు 21 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తన గ్లాంజా కారులో నూతన రూపాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన రూపం, ఆధునిక సాంకేతిక సదుపాయాలు, మెరుగైన భద్రతా లక్షణాలతో రూపొందించిన ఈ కొత్త కారును అక్టోబరు 14న విడుదల చేసింది. దీని ప్రారంభ ప్రదర్శనశాల ధరను రూ.6.99 లక్షలుగా నిర్ణయించింది. యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ కారుకు ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. నవంబరు మొదటి వారం నుంచి వినియోగదారులకు అందించనున్నారు.
కొత్త ఇంజిన్‌తో మెరుగైన మైలేజీ
కొత్త గ్లాంజాలో 1.2 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా సీఎన్‌జీ నమూనాల్లోనూ తొలిసారిగా ఆటోమేటిక్ గేర్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది. పెట్రోల్ మాన్యువల్ నమూనా లీటరుకు 23.80 కిలోమీటర్లు, ఆటోమేటిక్ నమూనా 24.77 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని పేర్కొంది.
ఆధునిక రూపం.. అధునాతన సదుపాయాలు
కొత్త గ్లాంజా ముందు భాగంలో మార్పులు చేసి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కొత్త గ్రిల్, స్పోర్టీ బంపర్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంపులు, పగటిపూట వెలిగే దీపాలు కారుకు ప్రత్యేక రూపాన్ని అందిస్తున్నాయి. లోపలి భాగంలోనూ సౌకర్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ముందు వరుసలో గాలి ప్రసరణతో కూడిన సీట్లు, హెడ్-అప్ ప్రదర్శన, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 360 డిగ్రీల కెమెరా వంటి సదుపాయాలు ఉన్నాయి. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు అనుకూలమైన 22.86 సెంటీమీటర్ల సమాచార, వినోద తెరను కూడా ఏర్పాటు చేశారు.
భద్రతకు ప్రాధాన్యం.. బుకింగ్‌లు ప్రారంభం
భద్రత విషయంలోనూ కొత్త గ్లాంజాలో పలు సదుపాయాలను అందిస్తున్నారు. లెవెల్-2 అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ, ఆరు గాలి సంచులు, కొండ ప్రాంతాల్లో వాహనం వెనక్కి జారకుండా నిలిపే సదుపాయం వంటి అంశాలు ఉన్నాయి. అక్టోబరు 15 నుంచి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. రూ.11,000 ముందస్తు చెల్లింపుతో కారును బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
నీలం ఛాయ కలిగిన నలుపు, డిజిటల్ టీల్ ఆకుపచ్చ సహా మొత్తం ఏడు రంగుల్లో ఈ కారు లభించనుంది. కొనుగోలుదారులకు మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల ప్రామాణిక హామీని అందిస్తున్నారు. అదనపు చెల్లింపుతో ఈ హామీని ఐదేళ్లు లేదా 2.20 లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించుకునే అవకాశం కల్పించారు.












