
క్రీడలు మనిషికి శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసాన్ని కూడా కలిగిస్తాయని రోటరీ వెస్ట్ క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రీడాకారులకు పౌష్టికాహారం కోసం నగదు చెక్కులను అందజేశారు.డాక్టర్ శ్రీలక్ష్మి, పి.ఎం. రావు దాతృత్వంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులు శారీరకంగా బలంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు సరైన పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల్లో రాణించాలంటే క్రమశిక్షణ, పట్టుదలతో పాటు సరైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమని అన్నారు.
రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున భవిష్యత్తులో కూడా క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. యువత క్రీడల వైపు మొగ్గుచూపాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ ఎల్లసరి గోపాల్ రెడ్డి, శ్రీకంటి రామ్మోహన్ రావు, త్రినాథ్ వాసు గౌడ్, బండి ధనుంజయ రెడ్డి, నెలబల్లి సిద్ధారెడ్డి, ఎన్. కృష్ణంరాజు, చోళవరం గిరిబాబు, సుబ్రహ్మణ్యం, కోట కృష్ణ, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.











