దివ్యాంగులకు ఉగాది కానుక దివ్యాంగ శక్తి’ పథకం

రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకానికి బుధవారం శ్రీకారం చుడుతున్నారు. శ్రీకాకుళంలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, హాజరుకానున్నారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలిసి ఈ సేవలను ప్రారంభించనున్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల శాసనసభ్యుల చేతుల మీదుగా ఈ ఉచిత బస్సు ప్రయాణ సేవలు ప్రారంభం కానున్నాయి.ఈ పథకం ద్వారా 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి 7,264 బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం లభించనుంది. గతంలో కేవలం 4 వర్గాలకే పరిమితమైన ఈ రాయితీని ప్రభుత్వం 21 వర్గాలకు విస్తరించింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగులతో పాటు వచ్చే సహాయకులకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఉదయం 11 గంటలకు ఆయా కేంద్రాల నుండి ఈ బస్సులు బయలుదేరనున్నాయి. శ్రీకాకుళంలో రాగోలు జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు, టెక్కలిలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి, ఆమదాలవలసలో బూర్జ ఎంపీడీఓ కార్యాలయం నుండి, ఎచ్చెర్లలో సుభద్రాపురం నుండి నరసన్నపేటలో ఎంపీడీఓ కార్యాలయం నుండి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయి. లబ్ధిదారులు తమ పాత పాసులతో లేదా ఆర్టీసీ యాప్ ద్వారా పొందే డిజిటల్ పాసులతో ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

Prajaveek Shanam