నెల్లూరు జిల్లా
మత్స్యకారులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోమని నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల ఆధీనంలో ఉన్న తమిళ జాలర్ల బోట్లను వారికి సమాచారం ఇవ్వకుండా అపహరించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఎంపీ బీదా మస్తాన్ రావు సహా టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిపారు. వెంటనే బోట్లను తిరిగి తీసుకువచ్చి యథాస్థానంలో ఉంచాలని డిమాండ్ చేశారు. బోట్ల అపహరణకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రణాళిక రూపొందించారని, దీనిపై ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల హక్కులను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మత్స్యకారులకు వైయస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను వైయస్ జగన్ మత్స్యకారుల కోసం ఏర్పాటు చేశారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరించడం ద్వారా వారి జీవితాలను మళ్లీ సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. హార్బర్ భూముల్లో 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్‌కు కేటాయించడం మత్స్యకారుల కడుపు కొట్టడమేనని మండిపడ్డారు. తమిళ జాలర్లు నిబంధనలు ఉల్లంఘించి తీరప్రాంతానికి చేరుకుని స్థానిక మత్స్యకారుల వలలను ధ్వంసం చేసి మత్స్య సంపదను దోచుకెళ్తున్నారని, ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులే మత్స్యకారులను బెదిరించడం దారుణమని అన్నారు. ఈ బోట్లను అక్రమంగా తరలించడంలో కీలక పాత్ర పోషించిన వారిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, తక్షణం బోట్లను తిరిగి తీసుకురాకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తరువాత ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు వైయస్ జగన్ ఇచ్చిన వరమని, దాన్ని ప్రైవేటుపరం చేయడం అన్యాయమని అన్నారు. త్వరలో మత్స్యకారులతో సమావేశం నిర్వహించి పోరాట కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళీధర్ మాట్లాడుతూ మత్స్యకారులకు అండగా ఉండాల్సిన అధికారులే కుట్రలకు పాల్పడటం హేయమని, మత్స్యకారుల సంక్షేమం కోసం వైయస్సార్సీపీ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు.











