ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వంట గ్యాస్ సమస్య రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు ఏజెన్సీల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల “నో స్టాక్” బోర్డులు పెట్టడం ప్రజల్లో మరింత అయోమయాన్ని కలిగిస్తోంది.గ్యాస్ బుక్ చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజులు గడిచినా సిలిండర్ డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఉదయం నుంచే క్యూల్లో నిలబడినా సరిపడా స్టాక్ లేక చాలా మంది ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. ఇదే సమయంలో మొబైల్ ఫోన్లకు డెలివరీ పూర్తయినట్లు సందేశాలు రావడం వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తోంది.కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గృహ వినియోగ గ్యాస్‌ను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని కూడా అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను ఏజెన్సీ నిర్వాహకులు ఖండిస్తూ, ప్లాంట్ నుంచి సరఫరా ఆలస్యమవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. స్టాక్ వచ్చిన వెంటనే అందరికీ గ్యాస్ అందిస్తామని వారు పేర్కొంటున్నారు.
“డెలివరీ అయినట్లు మెసేజ్ వస్తున్నా గ్యాస్ ఇవ్వడం లేదు. రోజూ లైన్లో నిలబడాల్సి వస్తోంది. ఉద్యోగాలకు వెళ్లలేకపోతున్నాం. పిల్లల చదువులు కూడా ప్రభావితమవుతున్నాయి” అంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోర్ డెలివరీ సక్రమంగా అమలు కాకపోవడం వల్ల ఇబ్బందులు మరింత పెరిగాయని చెబుతున్నారు.గ్యాస్ ఏజెన్సీల పనితీరుపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని, సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.











