
పిల్లలతో కలిసి భోజనం చేసి సమస్యలు తెలుసుకున్న సునీల్ కుమార్
గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ఆర్హెచ్ కాలనీలో ఉన్న మండల ప్రజా పరిషత్ ఎలిమెంటరీ స్కూల్‌ను గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి, మధ్యాహ్న భోజన పథకం అమలును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి చదువులు, పాఠశాలలో ఉన్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ గ్రౌండ్‌లో ఆటలు ఆడేందుకు తగిన క్రీడా సామగ్రి లేదని విద్యార్థులు కోరగా, అవసరమైన క్రీడా వస్తువులను 10 రోజులలోగా పాఠశాలకు అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థుల అభ్యర్థనలను సానుకూలంగా స్వీకరించిన ఆయన, పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయులతో కూడా సమావేశమై బోధన విధానం, పాఠశాల అవసరాలపై చర్చించారు. విద్యార్థులకు మంచి విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమం సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానికులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.












