
ఖమ్మం పట్టణంలోని గాంధీనగర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన ఘటన ఆలస్యంగా బయటపడింది.గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి, ప్రశాంతి దంపతులకు 20 సంవత్సరాల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో రవి త్వరలోనే చనిపోతాడని భావించిన భార్య ప్రశాంతి గత జూలై నెలలో భర్త పేరుతో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ చేయించింది.అయితే నెలలు గడిచినా రవి మరణించకపోవడంతో ప్రశాంతి హత్యకు పథకం రచించింది. ఈ నెల 2వ తేదీన రవికి మద్యం తాగించి, తన బావమరిది శ్రీనివాస్ సాయంతో కారుతో ఢీకొట్టించి హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు ప్రశాంతిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భర్తను హత్య చేయించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.











