పాఠశాల దుస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేసిన సివిల్ ఇంజనీర్ మురళీకృష్ణారెడ్డి

— ప్రజా వీక్షణం ప్రతినిధి
తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ఆముదాలపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మరియు ఆసుపత్రి పరిస్థితులపై సివిల్ ఇంజనీర్ గుండాల మురళీకృష్ణారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో సివిల్ ఇంజనీర్‌గా సేవలు అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన బాలిరెడ్డి పాలెం వాస్తవ్యులు మురళీకృష్ణారెడ్డి ప్రస్తుతం తన అనుభవాన్ని సామాజిక సేవకు వినియోగిస్తూ గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.ఆముదాలపాడు గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఆయన ఇటీవల అక్కడి ప్రాథమిక పాఠశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిస్థితులను పరిశీలించిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు మంజూరైనప్పటికీ అవి సక్రమంగా వినియోగం కాకపోవడం వల్ల పనులు నాసిరకంగా జరిగాయని ఆయన విమర్శించారు. కొంతమేర పనులు చేసి మధ్యలోనే వదిలేయడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.పాఠశాల ప్రాంగణంలో చెత్తాచెదారం పేరుకుపోవడం, బాత్రూంలు అపరిశుభ్రంగా ఉండటం వంటి పరిస్థితులను చూసి ఆయన తీవ్రంగా స్పందించారు. పిల్లలు చదువుకునే విద్యా దేవాలయాలను ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉంచడం బాధాకరమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలలను శుభ్రంగా, సౌకర్యవంతంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.ఈ సందర్భంగా రాజకీయాలపై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించిన మురళీకృష్ణారెడ్డి, ఎన్నికల వరకు రాజకీయాలు ఉండవచ్చని కానీ గ్రామాభివృద్ధి విషయంలో అందరూ ఒక్కటిగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు ప్రాణాధారమైన ఆసుపత్రులు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలు, ప్రతి ఇంటికి అవసరమైన తాగునీటి వంటి మౌలిక వసతుల విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.అనంతరం పాఠశాల విద్యార్థులతో మురళీకృష్ణారెడ్డి ముచ్చటించి వారి చదువుల గురించి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటానని, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మురళీకృష్ణారెడ్డి వెంట రౌతు వెంకటరమణయ్య, కృష్ణయ్య, కోటయ్య, మనోహర్‌లతో పాటు గ్రామానికి చెందిన పలువురు పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Prajaveek Shanam