
తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ముస్లిం వీధిలో ఉన్న ఎం.పీ. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చికెన్ ఫాక్స్ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తగా హోమియో మందులను మంగళవారం పంపిణీ చేశారు. కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ-1 ఆనంద్ మాట్లాడుతూ వేసవి కాలంలో విద్యార్థులకు ముఖ్యంగా అమ్మవారు (చికెన్ ఫాక్స్) సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలు అవసరమని తెలిపారు. చిట్టేడు హోమియో వైద్యాధికారి డాక్టర్ సురేష్ సూచనల మేరకు ఎం.వి. రావు ఫౌండేషన్ ప్రతి పాఠశాల విద్యార్థికి హోమియో మందులు అందజేయడం మంచి కార్యక్రమమని పేర్కొన్నారు.సేవా కార్యక్రమాల ద్వారా పలు గ్రామాల్లో ప్రజలకు, ముఖ్యంగా నిరుపేదలకు సహాయం అందిస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు మూడు రోజులపాటు ఉపయోగించే హోమియో మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పువరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం. విజయలక్ష్మి, ఎంఈఓ ఆనంద్, ఉపాధ్యాయులు జాలాది కిషోర్, పద్మావతి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజావీక్షణం ప్రతినిధి – వాకాడు.











