
నెల్లూరు జిల్లా చెన్నూరు గ్రామంలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో, స్వర్ణభారత్ ట్రస్ట్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మట్టం శ్రావణి రెడ్డి హాజరయ్యారు.ఈ శిబిరంలో సుమారు 100 మందికి పైగా గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ప్రతి ఒక్కరిని పరీక్షించి వారి అవసరాన్ని బట్టి కంటి మందులు ఉచితంగా అందజేశారు. కంటి శస్త్రచికిత్స అవసరమైన వారికి స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో అవసరమని తెలిపారు. కంటి చూపు మనిషి జీవితంలో అత్యంత విలువైనదని,చూపు కోల్పోతే జీవితం ఎంతో కష్టసాధ్యమవుతుందనిఅన్నారుఅందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద నగరాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడం చాలా సార్లు భారంగా మారుతుందని, అలాంటి పరిస్థితుల్లో గ్రామాలకే వచ్చి వైద్య సేవలు అందిస్తున్న ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య విజ్ఞాన సంస్థ మరియు స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు.అలాగే గ్రామాల్లో ఉన్న వృద్ధులు, మహిళలు, కార్మికులు తమ కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమయానికి చికిత్స తీసుకుంటే కంటి సమస్యలను సులభంగా నివారించవచ్చని, అందుకే ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఎక్కువగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో AMC డైరెక్టర్ మల్లి శ్యామల, క్రిస్టియన్ సెల్ సభ్యులు తాటిపర్తి శ్రీనివాసులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు చెన్నూరు అంకమ్మ, మేఖల మాధవి, బూత్ కన్వీనర్ అద్దంకి శ్రీను, వేడిచెర్ల వెంకటేశ్వర్లు, ట్రస్ట్ సిబ్బంది అనూప్ బాబు, ANMలు, ఆశ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.











