
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతన్నా మీకోసం వారోత్సవాలలో భాగంగా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధిదారులైన రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను అందించారు. అలాగే కూటమి ప్రభుత్వం పనితీరుపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.సోమవారం చెన్నూరు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఎల్లశిరి శ్రీనివాసులు రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ నెలబల్లి భాస్కర్ రెడ్డి, టిడిపి గూడూరు రూరల్ మండలం అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు శాలువాలు, గజమాలతో సత్కరించారు. భారీగా బాణసంచా పేల్చి గ్రామంలో స్వాగతం పలికారు. అనంతరం మహిళలు మంగళహారతులు ఇచ్చి ఎమ్మెల్యేను ఆహ్వానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతన్నా మీకోసం వారోత్సవాలలో భాగంగా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా లబ్ధి పొందిన రైతుల ఇళ్లకు ఎమ్మెల్యే వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి రైతులకు వివరించి కరపత్రాలను అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. చెన్నూరు గ్రామంలోని నాయకులు కొన్ని స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతంగా అమలవుతుందని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాల్లో 20 వేల రూపాయల ఆర్థిక సహాయం జమ చేస్తున్నామని వెల్లడించారు.ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ చెన్నూరు గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్క గ్రామాల పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యేను కోరారు. చెన్నూరు అరుంధతి వాడలో 20 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మిగిలి ఉన్న కాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.టిడిపి సీనియర్ నాయకులు ఎల్లశిరి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరికి సకాలంలో ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ నెలబల్లి భాస్కర్ రెడ్డి, మట్టం శ్రావణి రెడ్డి, ఎల్లశిరి శ్రీనివాసులు రెడ్డి, 24 సొసైటీ అధ్యక్షులు అల్లూరు కరుణాకర్ రెడ్డి, శ్రీకిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, డివిఎంసి సభ్యులు ఏసుపాక పెంచలయ్య, అబ్దుల్ రహీం, శ్రీకాంత్ రెడ్డి, మట్టం మురళి, చెన్నూరు నీటి సంఘం అధ్యక్షులు హేమ కుమార్ రెడ్డి, మల్లి శ్యామల, వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, వీఆర్వోలు, వెటర్నరీ వైద్య సిబ్బంది, బిజెపి, జనసేన నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.











