ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన సి ఐ శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్”*లో భాగంగా గూడూరు పట్టణంలో టు టౌన్ సి ఐ శ్రీనివాస్ బృందం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సోమవారం గూడూరు II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింపిరినాయుడు కాలువ కట్ట ప్రాంతంలో ఈ తనిఖీలు చేపట్టారు.రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ, ఐపీఎస్ (ఐజీపీ) పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించబడింది. అదనపు ఎస్పీ సౌజన్య సూచనలతో గూడూరు II టౌన్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ కొనసాగింది.ఈ ఆపరేషన్‌లో సుమారు 30 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు గుర్తించిన హాట్‌స్పాట్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు మొత్తం 150 ఇళ్లను తనిఖీ చేశారు.అలాగే వాహనాల తనిఖీలలో సరైన పత్రాలు లేని 5 బైక్‌లు మరియు ఒక ఆటోను గుర్తించి తగిన చర్యలు చేపట్టారు. పాత కేసుల్లో ఉన్న ఒక వ్యక్తిని కూడా పోలీసులు విచారించి, భవిష్యత్తులో మంచి ప్రవర్తనతో ఉండాలని హెచ్చరించారు.ఈ సందర్భంగా పోలీసులు స్థానిక ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని వివరించారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే AP EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఇదే సందర్భంగా స్థానిక ప్రజలకు రోడ్ సేఫ్టీ, ప్రాపర్టీ నేరాలు మరియు సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు “ఆపరేషన్ వజ్రప్రహార్” కింద ఇలాంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

Prajaveek Shanam