సర్వేపల్లిలో నాలుగో మెగా జాబ్ మేళాయువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం – ఎమ్మెల్యే సోమిరెడ్డి

సర్వేపల్లి నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు సీఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగో మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లిలో ఇది నాలుగో జాబ్ మేళా అని తెలిపారు. మొదట విక్రమ సింహపురి యూనివర్సిటీ, అనంతరం పొదలకూరు, ముత్తుకూరు ప్రాంతాల్లో జాబ్ మేళాలను నిర్వహించామని, ఇప్పటివరకు మొత్తం 1075 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని వెల్లడించారు. ఈ రోజు మనుబోలు ప్రాంతంలో నిర్వహించిన జాబ్ మేళాలో 16 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు అందించేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు.గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆయన, ఐదేళ్ల కాలంలో ఒక్క జాబ్ మేళా కూడా నిర్వహించలేదని ఆరోపించారు. అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు దూరమయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారించిందని, ముఖ్యంగా నారా లోకేష్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ఒక్క వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని, ప్రతి ఇంటిలో ఆ ఆనందం నింపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ముత్తుకూరు మండలంలో రిలయన్స్ కంపెనీ 2600 ఎకరాల భూమిని తీసుకుని 20 ఏళ్లుగా వినియోగించకపోవడం వల్ల ఆ ప్రాంతంలో అభివృద్ధి నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఆ భూముల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.మనుబోలు ప్రాంతంలో రూ.2500 కోట్ల పెట్టుబడితో ఒక పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చిందని, ఆ పరిశ్రమ విజయవంతంగా స్థాపించబడాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.ఇక రామదాసుకండ్రిగలో భూముల వ్యవహారంపై స్పందిస్తూ, 57 ఎకరాల భూమిని బినామీ కంపెనీల ద్వారా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఆ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, కోర్టులో స్టే తెచ్చి అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని విమర్శించారు.ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుతో వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధిని అడ్డుకోవడం తగదని అన్నారు. సర్వేపల్లి అభివృద్ధిని కోరుకునే వ్యక్తి అయితే కోర్టు కేసులను వెనక్కి తీసుకోవాలని కాకాణికి హితవు పలికారు.
ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

Prajaveek Shanam