మాదకద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం (కార్డన్ సెర్చ్)

వజ్రప్రహార్ ఆపరేషన్‌లో చిల్లకూరులో భారీ తనిఖీలు – రౌడీ షీటర్లకు వార్నింగ్రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు చేపట్టిన “వజ్రప్రహార్” ఆపరేషన్ క్రమంలో నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మిక్స్డ్ కాలనీలో బుధవారం కట్టుదిట్టమైన కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, గూడూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో గూడూరు 1టౌన్, 2టౌన్, రూరల్, చిల్లకూరు పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది కలిసి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 300 ఇళ్లను పరిశీలించిన పోలీసులు నివాసితుల వివరాలు, అద్దెదారుల సమాచారం సేకరించారు. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాల తనిఖీల్లో పత్రాలు లేని ఆరు ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.పాత నేర చరిత్ర కలిగిన ముగ్గురు రౌడీ షీటర్లను గుర్తించి వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ, వారి ప్రవర్తన మార్చుకోవాలని గట్టిగా హెచ్చరించారు.ప్రజలలో అవగాహన పెంచే లక్ష్యంతో పోలీసులు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, సామాజిక నష్టాలపై వివరించారు. అలాగే రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం, హెల్మెట్ వినియోగం, వాహన పత్రాల ప్రాముఖ్యత, ఆస్తి నేరాల నివారణ, సైబర్ మోసాల నుంచి రక్షణ వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు.గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే AP EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972, డయల్ 112 లేదా కంట్రోల్ రూమ్ నెంబర్ 9392903143కు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుబడి ఉన్నారని, “వజ్రప్రహార్” ఆపరేషన్ కింద ఇలాంటి క్రమబద్ధమైన తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

Prajaveek Shanam