నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం నేటి నుండి అధికారికంగా ప్రారంభమైంది. ఈ పథకం దివ్యాంగుల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతుందని గూడూరు ఆర్డీవో సత్యనారాయణ తెలిపారు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్లో ఈ ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఆర్డీవో సత్యనారాయణతో పాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.కార్యక్రమానికి విచ్చేసిన ఆర్డీవో మరియు టిడిపి నాయకులకు ఆర్టీసీ అధికారులు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయబద్ధంగా బస్సుకు పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు.ఆర్డీవో సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. 40 శాతం లేదా అంతకు పైగా దివ్యాంగత శాతం కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఇప్పటి వరకు ప్రయాణ ఖర్చుల కారణంగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులు ఇకపై ఎటువంటి భయం లేకుండా ఎక్కడికైనా సౌకర్యంగా ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు. ఈ పథకం ద్వారా విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాల కోసం వెళ్లే దివ్యాంగులకు పెద్ద మద్దతు లభిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఇలాంటి పథకాలు చాలా అవసరమని, ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల వారి రోజువారీ జీవితంలో గణనీయమైన మార్పు వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రయాణ ఖర్చుల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దివ్యాంగులకు ఇది పెద్ద ఊరటనిస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే వారికి ఇది మరింత ఉపయోగకరమని తెలిపారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వస్తుందని తెల్పారు. దివ్యాంగుల అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని టిడిపి నాయకులు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం చెంచులక్ష్మి, నాయకులు రహీం, వెంకటేశ్వరరాజు, పెంచలయ్య, లీలావతి, మట్టం శ్రావణి రెడ్డి , భారతి తదితరులు పాల్గొన్నారు.












