నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన – యువతకు 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

నెల్లూరు నగరంలో శుక్రవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విస్తృతంగా పర్యటించారు. సంతపేట మార్కెట్‌తో పాటు పినాకిని పార్క్‌లోని సచివాలయాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మొత్తం 20 లక్షల ఉద్యోగాల సృష్టి దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతోందన్నారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆహ్వానం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం, MSME క్లస్టర్‌ను త్వరలో పూర్తి చేయడం ద్వారా స్థానిక యువతకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
సంతపేట సచివాలయంలో అధికారులతో సమావేశమై ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గొల్లవీధిలో ముస్లిం సోదరులతో కలుసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
నెల్లూరులో పొగతోట సహా 15 ముఖ్య ప్రాంతాల్లో డ్రైనేజీ, సిమెంట్ రోడ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎన్నికల హామీలకంటే అధికంగా అభివృద్ధి చేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.ఈ పర్యటనలో మేయర్ సుజాత, కమిషనర్ నందన్, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

Prajaveek Shanam