గ్యాస్ సరఫరా లోపాలపై సీపీఐ ఆగ్రహం – సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్

గూడూరు: ప్రజలకు గ్యాస్ సిలిండర్లు సకాలంలో సరఫరా చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.హెచ్. ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం గూడూరు పట్టణంలో నిర్వహించిన సీపీఐ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులను సాకుగా చూపుతూ దేశంలో గ్యాస్ ధరలను పెంచడం సరైన విధానం కాదని ఆయన విమర్శించారు. దేశంలో చమురు, గ్యాస్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. గ్యాస్ ఏజెన్సీలు కంపెనీల నుంచి సరఫరా రావడం లేదని చెప్పి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. బుకింగ్ చేసిన తర్వాత వారం రోజులైనా గ్యాస్ సిలిండర్లు అందడం లేదని, బ్లాక్ మార్కెట్‌లో ఒక సిలిండర్ ధర రూ.2,000 నుండి రూ.4,000 వరకు పెరిగిందని తెలిపారు. గ్యాస్ కొరతను నెపంగా చూపుతూ హోటల్ యజమానులు ఆహార పదార్థాల ధరలను పెంచుతున్నారని ఆయన అన్నారు. వెంటనే గ్యాస్ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి, ప్రజలకు సకాలంలో సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శశి కుమార్, సహాయక కార్యదర్శి జమాలుల్లా, పట్టణ కన్వీనర్ సునీల్, చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి నారాయణ, ప్రజా నాట్య మండలి నాయకులు గోపాల్, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

Prajaveek Shanam