పంట నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రతి సెంటు భూమికి నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతసాగరం మండలంలోని చిలకలమర్రి, కామిరెడ్డిపాడు, మంగుపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి, పత్తి, మిరప తదితర పంటలను మంత్రి రైతులు, అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టపోయిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేయగా, ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చి ఓదార్చారు. అనంతరం అనంతసాగరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖల అధికారులు పంట నష్టం వివరాలను మంత్రికి తెలియజేశారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా అనంతసాగరం, మర్రిపాడు, కలువాయి, రాపూరు, సీతారాంపురం, లింగసముద్రం మండలాల్లోని 21 గ్రామాల్లో 1469 మంది రైతులు సుమారు 1289 హెక్టార్లలో పంటలను నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. అనంతసాగరం మండలంలోనే అత్యధికంగా 1054 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని, ముఖ్యంగా వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు. మొక్కజొన్న, మిరప, నిమ్మ, పొగాకు పంటలు కూడా కొంత మేర ప్రభావితమయ్యాయని తెలిపారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తక్షణమే కచ్చితమైన ఎన్యుమరేషన్ పూర్తి చేసి నివేదికను కలెక్టర్‌కు అందించాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించి మార్గదర్శకాల మేరకు సకాలంలో నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడులతో పంట నష్టం అంశంపై చర్చించామని, రైతులకు సహాయం చేయడంలో వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దని, వారి కష్టానికి తప్పకుండా న్యాయం చేసి త్వరలోనే నష్టపరిహారం అందజేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి నర్సోజి రావు, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, ఆర్డీవో పావని, తహసీల్దార్ పద్మజ, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.











